Red sauce: చిన్న విషయాలకే పెద్ద గొడవలు చేసే ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. కొంతమంది ఊరికెనే సహనం కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఢిల్లీలో అలాంటి ఘటనే జరిగింది. మోమోస్లకు రెడ్ సాస్ అదనంగా అడిగాడని కస్టమర్‌పై ముఖంపై ఓ మోమోస్ వ్యాపారి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. షాహ్దారాలోని ఫార్స్ బజార్ ఏరియాలో సందీప్ అనే 34 ఏళ్ల వ్యక్తి మోమోస్ తినేందుకు ఓ వీధి వ్యాపారి వద్దకు వెళ్లాడు. మోమోస్ కొనుగోలు చేసిన తర్వాత రెడ్ సాస్ అదనంగా కావాలని అడిగాడు. దాంతో వీధి వ్యాపారి వికాస్ (22) లేదని చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సందీప్ ముఖంపై వికాస్ కత్తితో పొడిచి పారిపోయాడు.
ఈ కత్తి దాడిలో ముఖంపై తీవ్ర గాయాలైన వికాస్ హెడ్గెవార్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరుగగా, గురువారం ఉదయం పోలీసులు నిందితుడు వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.