Mohun Baingan : కేంద్ర మంత్రి (Union Minister) మన్సుక్ మాండవీయ (Mansuk Mandaviya) రెండు పదాలను తప్పుగా ఉచ్చరిండం పశ్చిమబెంగాల్ (West Bengal) లో రాజకీయ దుమారానికి దారితీసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బెంగాల్ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరుస్తోందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. కాగా కేంద్రమంత్రి ఉచ్చారణలో తప్పిదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, అందులో తప్పుపట్టడానికి ఏముందని బీజేపీ ప్రశ్నిస్తోంది.
భారత ఫుట్‌బాల్ లీగ్ అయిన ‘ఇండియన్ సూపర్ లీగ్ (ISL) లో సంక్షోభం పరిష్కారం కోసం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి మనుసుక్ మాండవీయ మాట్లాడారు. ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన రెండు ఫుట్‌బాల్ క్లబ్‌ల పేర్లను ఆయన తప్పుగా ఉచ్చరించారు. మొహున్ బగన్ అనడానికి బదులుగా మొహున్ బైంగన్ అని, ఈస్ట్ బెంగాల్ అనడానికి బదులుగా ఈస్ట్ బైంగన్ ఆయన ఉచ్చరించారు.
బెంగాల్లో బైంగన్ అనే పదానికి వంకాయ అనే అర్థం వస్తుంది. దాంతో పశ్చిమబెంగాల్ సంస్కృతిని కేంద్ర సర్కారు కించపరుస్తోందని టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర క్రీడల మంత్రికి దేశంలోని రెండు ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌ల పేర్లు కూడా ఉచ్చరించడం రాకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇండియన్ సూపర్ లీగ్ ఈ నెల 14న ప్రారంభం కానుంది. మొత్తం 14 క్లబ్‌లు ఈ లీగ్‌లో తలపడనున్నాయి.