కొచ్చి: జస్టిస్ హేమ కమిటీ నివేదిక మాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. మలయాళం సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి అనేక అంశాలు బయటపడటంతో ప్రముఖులంతా రాజీనామా బాట పడుతున్నారు. తాజాగా మలయాళీ సినీ కళాకారుల సంఘం (అమ్మ) అధ్యక్షుడు మోహన్ లాల్ సహా ఆఫీస్ బేరర్లందరూ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ‘అమ్మ’ ఓ ప్రకటనను విడుదల చేసింది. కొందరు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అన్ని రకాల మీడియాలలోనూ వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. నూతన పాలక మండలిని రెండు నెలల్లోగా ఎన్నుకోనున్నట్లు తెలిపింది. రాజీనామా చేసిన పాలక మండలి తాత్కాలికంగా బాధ్యతలను నిర్వహిస్తుందని వివరించింది. అంతకుముందు మోహన్ లాల్ ఈ సంఘం కార్యవర్గ సభ్యులందరితోనూ ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తున్నది.