న్యూఢిల్లీ, జూలై 17: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడంపై విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. కీలక సమావేశానికి ప్రధాని గైర్హాజరు కావడమేంటని ప్రశ్నించారు. అఖిలపక్షానికి ప్రధాని హాజరుకాకపోవడం ‘అన్‌పార్లమెంటరీ’ కాదా? అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు అగ్నిపథ్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలతో పాటు దేశ సమాఖ్య వ్యవస్థ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న తీరును లేవనెత్తాయి. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని పార్టీలను కోరారు. విపక్షాలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. గతంలో ప్రధానిగా చేసిన మన్మోహన్ కూడా పలుమార్లు అఖిలపక్ష సమావేశాలకు రాలేదని పేర్కొన్నది.