(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కేంద్రం, రాష్ర్టాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుందని తరుచూ వల్లెవేసే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టాల హక్కులను కాలరాయాలనుకొన్నారా? రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కుట్ర చేశారా? జర్నలిస్టుల సమాఖ్య వేదిక ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ సౌజన్యంతో ‘అల్‌జజీరా’ వెబ్‌పోర్టల్ తాజాగా ప్రచురించిన కథనం ఇవే అనుమానాలకు తావిస్తున్నది. పన్నుల ద్వారా కేంద్రప్రభుత్వానికి వచ్చే నిధుల్లో రాష్ర్టాల వాటాను తగ్గించాలంటూ ప్రధాని మోదీ.. ఫైనాన్స్ కమిషన్‌పై ఒత్తిళ్లు తీసుకొచ్చారని ‘అల్‌జజీరా’ పేర్కొంది. రాష్ర్టాల వాటాను 33 శాతానికి పరిమితం చేయాలని ఆయన సూచించినట్టు వెల్లడించింది. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే మోదీ రహస్యంగా ఈ పని చేశారని పత్రిక వివరించింది. అయితే, ఫైనాన్స్ కమిషన్‌కు అప్పుడు చైర్మన్‌గా వ్యవహరించిన వైవీ రెడ్డి మోదీ ప్రతిపాదనను తిరస్కరించారని తెలిపింది. ఈ విషయాన్ని నీతిఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యమ్ కిందటేడాది జరిగిన ఓ సదస్సులో వెల్లడించినట్టు పత్రిక వివరించింది.
2015 ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కేంద్రప్రభుత్వ పన్ను రాబడుల్లో రాష్ర్టాలకు ఇస్తున్న 32 శాతం వాటాను 42 శాతానికి పెంచాలంటూ 14వ ఫైనాన్స్ కమిషన్ ఈ సమావేశాల్లో సిఫారసు చేసింది. దీంతో వెంటనే స్పందించిన ప్రధాని మోదీ.. కమిషన్ సిఫారసులను స్వాగతిస్తున్నట్టు మాటమార్చేశారని పత్రిక వెల్లడించింది. చైర్మన్‌తో జరిపిన రహస్య సంభాషణలో రాష్ర్టాల వాటాను 33 శాతానికి పరిమితం చేయాలన్న మోదీ.. బహిరంగంగా మాత్రం 42 శాతం వాటాకు సమ్మతిస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేసింది. ఇదే అంశంపై సుబ్రహ్మణ్యమ్, కేంద్ర ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయాన్ని తమ బృందం సంప్రదించాలని ప్రయత్నించినప్పటికీ, అటునుంచి ఎలాంటి స్పందన రాలేదని అల్‌జజీరా పేర్కొంది. సదస్సులో సుబ్రహ్మణ్యమ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ కూడా యూట్యూబ్ నుంచి మాయమైనట్టు ‘ది వైర్’ పత్రిక వెల్లడించింది.