PM Narendra Modi | పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ హుస్సేన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే సెప్టెంబర్‌లో సమావేశమయ్యే సూచనలు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ఖండ్లో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సదస్సు సెప్టెంబర్ 15,16 తేదీల్లో జరుగనున్నది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు.ఒకవేళ ఇద్దరు సమావేశంలో పాల్గొంటే దాదాపు ఆరేండ్ల తర్వాత రెండు దాయాది దేశాల ప్రధానులు ఒకే సదస్సులో పాల్గొనడం తొలిసారి అవుతుంది. ఈ సదస్సు సందర్భంగా ఇరు ప్రధానుల మధ్య ముఖాముఖీ భేటీలు ఉండవచ్చునని సమాచారం.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సుకు హాజరు కావాలని పాక్ ప్రధాని షెహబాజ్ హుస్సేన్‌ను ఎస్సీవో సెక్రటరీ జనరల్ ఝాంగ్ మింగ్ కోరారు. ఈ మేరకు మూడు రోజుల పర్యటన కోసం పాకిస్థాన్‌కు వచ్చారని ది న్యూస్ ఒక వార్తా కథనం ప్రచురించింది. పాకిస్థాన్ ప్రధానితో భేటీ గురించి భారత్ తమను సంప్రదించలేదని ఉన్నతస్థాయి దౌత్యవర్గాలు చెప్పాయి. ఒకవేళ భారత్ కోరితే, పాకిస్థాన్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆ వర్గాల కథనం.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో)లో చైనా, పాకిస్థాన్, రష్యా, భారత్, తజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్, కజకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. సదస్సు ప్రాధాన్యాలను ఎస్సీవో నూతన అధినేత ఖరారు చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు, దారిద్య్ర నిర్మూలన తదితర అంశాలపై సదస్సులో చర్చిస్తారు.