Canada | న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత్ – కెనడా మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. గత జూన్‌లో కెనడాలోని సర్రేలో జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో అక్కడి భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు పలువురు దౌత్యవేత్తలను అనుమానితులు (పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్)గా కెనడా పేర్కొన్నది. ఈ మేరకు ఆదివారం భారత విదేశాంగ శాఖకు దౌత్యపరమైన సమాచారాన్ని పంపింది. కెనడా తీసుకున్న ఈ అసాధారణ చర్యతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. కెనడా తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్‌లోని ఆ దేశ రాయబారికి సమన్లు ఇవ్వడంతో పాటు కెనడా లక్ష్యంగా చేసుకున్న భారత దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది.
దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్న భారత్
కెనడాలోని భారత హైకమిషనర్‌తో పాటు ఆ దేశం లక్ష్యంగా చేసుకున్న దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కు పిలిపించాలని భారత ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. నిరాధార ఆరోపణలతో వారిని లక్ష్యంగా చేసుకొవడం సరికాదని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అతివాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో సర్కారు చర్యలు వారి భద్రతను ప్రమాదంలోకి నెట్టాయని ఆరోపించింది. వారి భద్రత విషయంలో ప్రస్తుత కెనడా ప్రభుత్వ నిబద్ధతపై నమ్మకం లేదని, కాబట్టి వారిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది. ఈ విషయాన్ని భారత్‌లోని కెనడా యాక్టింగ్ హైకమిషనర్ స్టీవార్ట్ వీలర్‌కు తెలిపింది. అంతకుముందు ఆయనకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. కాగా, నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, తిరుగులేని ఆధారాన్ని అందించినట్టు స్టీవార్ట్ పేర్కొన్నారు.
ఆరుగురు కెనడా దౌత్యవేత్తల బహిష్కరణ
ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత విదేశాంగ శాఖ బహిష్కరించింది. స్టీవార్ట్ వీలర్‌తో పాటు డిప్యూటీ హైకమిషనర్ పాట్రిక్ హెబెర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మారీ కాథెరీన్ జోలీ, ఐయాన్ రాస్ డేవిడ్ ట్రైట్స్, అడమ్ జేమ్స్ చుయిప్క, పౌలా అర్జూలాను బహిష్కరిస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. వీరు 19వ తేదీ నాటికి భారత్‌ను వీడాలని ఆదేశించింది. కాగా, భారత్ చర్యకు ప్రతిస్పందనగా కెనడా సైతం ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి మీడియా పేర్కొన్నది. ఈ ఆరుగురు దౌత్యవేత్తలకు నిజ్జర్ హత్యకేసుతో సంబంధాలు ఉన్నట్టు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని ఓ అధికారిని ఉటంకిస్తూ తెలిపింది.
కెనడావి ఓటు బ్యాంకు రాజకీయాలు
కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఓ రాజకీయ ఎజెండాతో ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నదని, అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా అతివాదం, హింస, వేర్పాటువాదానికి మద్దతు ఇస్తున్న ట్రూడో ప్రభుత్వ చర్యలకు ప్రతిస్పందనగా తదుపరి చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు భారత్‌కు హక్కు ఉందని స్పష్టం చేసింది. నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్‌లోనే భారత్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారని, కానీ ఇంతవరకు ఎటువంటి ఆధారాలను తమతో పంచుకోలేదని తెలిపింది.
విచారణ పేరుతో భారత్‌ను బదనాం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందే వ్యూహాన్ని ట్రూడో అమలు చేస్తున్నట్టు సందేహం ఉందని పేర్కొన్నది. భారత్‌కు వ్యతిరేకంగా అతివాద, వేర్పాటువాద అజెండాకు బహిరంగంగా మద్దతు ఇస్తున్న వ్యక్తులు ట్రూడో క్యాబినెట్లో ఉన్నారని ఆరోపించింది. భారత్‌కు వ్యతిరేకంగా వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్న వ్యక్తి నాయకత్వంలోని రాజకీయ పార్టీపై ట్రూడో ప్రభుత్వం ఆధారపడి ఉందని పేర్కొన్నది.