న్యూఢిల్లీ, శ్రీనగర్, మే 3: ఉగ్రవాదుల పని పట్టకుండా ఊరుకోమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, దాడి వెనుక ఉన్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని, వారిపై దృఢమైన, తిరుగులేని చర్య తప్పదని మోదీ శనివారం ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీలో అంగోలా అధ్యక్షుడు జోఓ లారెన్కోతో సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
మానవ జాతికి ఉగ్రవాదం తీవ్రమైన ముప్పు అన్న విషయంలో ఇరు దేశాల నేతలం ఏకాభిప్రాయంతో ఉన్నామని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వడం పట్ల, మృతులకు సంతాపం తెలపడం పట్ల ఆయన కాంగో అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 9న రష్యాలో జరిగే ఆ దేశ విక్టరీ డే వేడుకలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హాజరు కాకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పాపాల కుండ నిండిపోయిందని, ఉగ్రవాదం తక్షణం అంతమవ్వాలని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. గత నెల 22న పహల్గాంలో జరిగిన నరమేధం వెనుక ఉన్నవారు నరకంలో కుళ్లిపోతారన్నారు. ఈ దాడిలో మరణించిన అదిల్ షా కుటుంబ సభ్యులను ఫరూఖ్ శనివారం పరామర్శించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి త్యాగాలు వృథా కాబోవని చెప్పారు. దీనికి ప్రతీకారం తప్పకుండా ఉంటుందన్నారు. ఇదిలావుండగా, జమ్ము కశ్మీర్ ప్రస్తుత సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. పహల్గాం ఉగ్రదాడితోపాటు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశం మోదీ నివాసంలో 30 నిమిషాలపాటు జరిగింది. పహల్గాం దాడి తర్వాత వీరిద్దరూ తొలిసారి కలిశారు.