న్యూఢిల్లీ, జూన్ 10: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే సర్కార్‌పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మాణిక్కం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కేంద్రంలో ప్రభుత్వం మారిపోతుందని, ‘ఇండియా కూటమి’ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన జోస్యం చెప్పారు. మరికొద్ది నెలల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో కేంద్రంలో సర్కార్ మారిపోతుందని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రివర్గ ప్రమాణస్వీకారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్క్ అందుకోలేదని, అయినప్పటికీ ప్రధానిగా మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారని విమర్శించారు. ‘చంద్రబాబు, నితీశ్‌ల మద్దతుతో మోదీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఎన్డీయే సర్కార్ జీవితకాలం భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడింది. అదానీ, అంబానీల కోసం మోదీ ప్రభుత్వాన్ని నడుపుతారు. అదానీ, అంబానీల కోసమే మోదీ 3.0 ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది’ అని అన్నారు.