ముంబై: మహారాష్ట్రలో మళ్లీ భాషా వివాదం రాజుకున్నది. థానేలో జరిగిన ఘటనకు నిరసనగా ఇవాళ రాజ్‌థాక్రేకు చెందిన ఎంఎన్ఎస్(MNS Protest) పార్టీ ఆందోళన నిర్వహించింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపుకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి పర్మిషన్ లేకపోవడంతో.. స్థానిక నేత అవినాశ్ జాదవ్‌ను అరెస్టు చేశారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఇచ్చిన ర్యాలీ పిలుపును పోలీసులు అడ్డుకున్నారు. మీరా బయాందేర్ ఏరియాలో జరగనున్న ర్యాలీ నేపథ్యంలో నేతల్ని అరెస్టు చేశారు. థానేతో పాటు పాల్గర్ ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 నిమిషాలకు అవినాశ్ జాదవ్‌ను అరెస్టు చేశారు. అతని అరెస్టుకు చెందిన వీడియోను ఎంఎన్ఎస్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
మీరా భయాందర్‌లో ర్యాలీ నిర్వహించేందుకు ఎంఎన్ఎస్ మోర్చాకు అనుమతి ఇచ్చినట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. కానీ ర్యాలీ రూటును మార్చాలని ఆ పార్టీ పట్టుపట్టిందని ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యల వల్ల కూడా మహారాష్ట్ర భాషా వివాదం మరింత ఆందోళనకరంగా మారిందన్నారు.
జూలై ఒకటో తేదీన భయాందర్ ఏరియాలో ఓ ఫుడ్‌స్టార్ ఓనర్‌పై ఎంఎన్ఎస్ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. మరాఠీ మాట్లానందుకు అతన్ని కొట్టారు. ఆ దాడికి చెందిన వీడియో వైరల్ అయ్యింది. దాడి చేసిన వారిలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఉన్నట్లు గుర్తించారు. మీరా రోడ్డులో ఉన్న జోధ్‌పూర్ స్వీట్ షాపులో ఓ ఉద్యోగి హిందీ మాట్లాడడంతో వివాదం చెలరేగింది.