న్యూఢిల్లీ, మే 16: నిరుద్యోగ యువతపై తాను చేసిన బొద్దింకల వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన ఒక రోజు తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాం త్ వివరణ ఇచ్చారు. ఒక వ్యర్థ కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించిందని తెలిపారు. నకిలీ, బూటకపు డిగ్రీల సహాయంతో బార్(న్యాయవాద వృత్తి) వంటి వృత్తులోకి ప్రవేశించిన వారిని నేను ప్రత్యేకంగా విమర్శించాను.
అలాంటి వ్యక్తులే మీడియా, సోషల్ మీడియా, ఉన్నత వృత్తులలోకి కూడా చొరబడ్డారు. అందువల్ల వారు పరాన్న జీవుల వంటివారు అని అన్నానని సీజేఐ తెలిపారు నేను మన దేశ యువతను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారం. మన ప్రస్తుత, భవిష్యత్తు మానవ వనరుల పట్ల నేను గర్వపడటమే కాకుండా దేశంలోని ప్రతి యువకుడు నాకు స్ఫూర్తినిస్తాడు. భారత యువతకు నా పట్ల గొప్ప గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. నేను కూడా వారిని అభివృద్ధి చెందిన భారత్కు మూల స్తంభాలుగా భావిస్తాను అని సూర్యకాంత్ చెప్పారు.