లక్నో: ఒక అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఒకేసారి చెల్లించే స్థోమత లేని వ్యక్తిని వాయిదాల్లో చెల్లించాలని చెప్పాడు. (Bribe In Instalments) అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లంచాన్ని తీసుకుంటూ విజిలెన్స్ డిపార్ట్మెంట్కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. మదర్సా మంజురియా అక్తరుల్ ఉలూమ్‌కు చెందిన ఆరిష్, రాజ్‌పురా నుంచి వసుంధర గ్రామానికి మదర్సాను తరలించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేశాడు. వక్ఫ్ సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఆసిఫ్ ఆ ఫైల్‌ను ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉంచాడు. ఉన్నతాధికారుల వద్దకు ఆ ఫైల్ పంపేందుకు లక్ష లంచం డిమాండ్ చేశాడు.
కాగా, ఒకేసారి అంత డబ్బు ఇవ్వలేనని ఆరిష్ తెలిపాడు. దీంతో వాయిదాల్లో లంచాన్ని చెల్లించాలని అధికారి ఆసిఫ్ చెప్పాడు. అయితే విజిలెన్స్ డిపార్ట్మెంట్ను ఆరిష్ ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అధికారి ఆసిఫ్‌ను ట్రాప్ చేశారు. తొలి వాయిదా లంచం కింద రూ.18,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.