బెంగుళూరు: కర్నాటక(Karnataka)లో ఘోరం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేశాడు. జూలై 10వ తేదీన నాటు తుపాకీతో కాల్చి చంపాడు. లివిన్ భాగస్వామిగా ఉంటున్న ఆ అమ్మాయి వయసు కూడా పదహారేళ్లే. మరో అబ్బాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినట్లు గమనించిన ఆ మైనర్ ఆమెను హతమార్చాడు. ఆ క్రైం నుంచి తప్పించుకునే క్రమంలో మరో ఇద్దరి సాయాన్నికోరాడు. అమ్మాయి మృతదేహాన్ని వ్యవసాయ క్షేత్రంలో పూడ్చి పెట్టారు. ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనకపుర తాలూకాలోని కొడిహల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కెంపలనాథ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఈ మర్డర్ వెలుగులోకి వచ్చింది. అమ్మాయి పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుడిని పట్టుకున్నారు.
నిందిత మైనర్ వెంకటరాయదొడ్డి గ్రామస్థుడు. అతను 9వ క్లాసు డ్రాపౌట్. ఈ కేసులో అరెస్టు అయిన వారిలో అతని సోదరుడు పుట్టమాద, మేనమామ హరీశ్ ఉన్నారు. ఆ ఇద్దరూ రోజువారీ కార్మికులు. కెంపలనాథ గ్రామంలో ఉంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సోషల్ మీడియాలో పరిచయం తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. స్వంత గ్రామంలోనే మైనర్ బాలుడు తమ ఇంటి సమీపంలోనే అమ్మాయితో మరో ఇంట్లో నెల రోజులుగా ఉంటున్నట్లు గుర్తించారు. వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి అబ్బాయి పేరెంట్స్‌కు కూడా తెలుసు. అమ్మాయి మృతదేహన్ని ఇవాళ వెలికితీయనున్నారు. తుపాకీని సీజ్ చేశారు.
తన లివిన్ పార్ట్నర్ మరో అబ్బాయితో ఇన్‌స్టా చాటింగ్ చేయడాన్ని నిందితుడు గమనించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతను ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆమెపై దాడి చేశాడు. నాటు తుపాకీతో ఆమె ముఖంలోకి కాల్చేశాడు. ఆ అమ్మాయి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది.ఆ తర్వాత ఇద్దరి హెల్ప్ తీసుకుని వ్యవసాయ క్షేత్రంలో ఆమె మృతదేహన్ని పూడ్చిపెట్టారు. నిందిత మైనర్‌కు చెందిన తాతయ్య వద్ద తుపాకీ తీసుకున్నట్లు తెలిసింది. మర్డర్ గురించి హరీశ్ తన మిత్రుడికి చెప్పడంతో ఆ విషయం ఊరంతా పాకింది. దీంతో ఆ అమ్మాయి తల్లితండ్రులు పోలీసులకు మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశారు.
హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అతనితో పాటు అతనికి సహకరించిన వారిపై కేసు బుక్ చేశారు. పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.