బులంద్‌షహర్, మే 11: బీజేపీ పాలిత యూపీలో మరో దారుణం చోటుచేసుకున్నది. నడుస్తున్న కారులో ఒక మైనర్‌పై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడటమే కాక, ఆమె స్నేహితురాలిని కారులోంచి బయటకు గెంటేయడంతో తీవ్రంగా గాయపడి మరణించింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
గ్రేటర్ నోయిడా వాసులైన సందీప్, అమిత్, ఘజియాబాద్‌కు చెందిన గౌరవ్‌లు లక్నోలో ఉద్యోగం ఇప్పిస్తామని మభ్యపెట్టి ఇద్దరు బాలికలను గ్రేటర్ నోయిడాలో కారు ఎక్కించుకున్నారు. దారిలో కారులోనే ముగ్గురూ మద్యం సేవించారు. తర్వాత ఇద్దరిపై లైంగిక దాడికి ప్రయత్నించగా, యువతులతో వారికి గొడవ జరిగింది. దీంతో వారు ఒక యువతిని కారులోంచి బయటకు తోసేయడంతో ఆమె తీవ్ర గాయాలతో మరణించింది.
తర్వాత ముగ్గురూ నడుస్తున్న కారులోనే మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి చేశారు. అయితే బులందర్ షా జిల్లా ఖుర్జాలో ఆమె వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు వెళ్తున్న కియా కారును అలీగఢ్-బులంద్‌షహర్ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిందితులు ఎదురుదాడికి దిగడంతో, పోలీసులు జరిగిన ఎదురుకాల్పుల్లో సందీప్, గౌరవ్‌ల కాలికి గాయాలయ్యాయి. రెండు పిస్తోళ్లను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్ఎస్పీ దినేశ్ కుమార్ సింగ్ చెప్పారు.