Karnataka : కర్ణాటకలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని దేవహనల్లిలో ఈ నెల 17, శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక (14)ను రేణుక అనే యువతి దేవనహల్లి సమీపంలోని ఒక గుడికి తీసుకెళ్తానని నమ్మించింది. ఈ నెల 17న ఆమెను తీసుకుని వెళ్లి, నవీన్, వెంకట రమణ అనే యువకులకు అప్పగించింది. వారు బాలికను ఆటోలో ఎక్కించుకుని వేరే చోటుకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఆటోలోనే బాలికకు బలవంతంగా ఆల్కహాల్ తాగించారు.
తర్వాత బాలిక ఇంటివైపు ఆటోను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత బాలిక మద్యం తాగి ఉండటం మంచిది కాదని భావించారు. ఇదే విషయం బాలికకు చెప్పారు. ఇప్పుడు నువ్వు మద్యం తాగి ఉన్నావని, ఇంటి దగ్గర దించితే మద్యం తాగినందుకు మీ నాన్న నిన్ను తిడతాడని చెప్పారు. అందువల్ల వేరే చోటుకు తీసుకెళ్తున్నామని చెప్పి, ఒక నిర్మాణంలో ఉన్న బిల్డింగు వద్దకు తీసుకెళ్లారు. ఎవరూ లేని ఆ ప్రదేశంలో రాత్రంతా ఇద్దరూ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై దాడి కూడా చేశారు. అనంతరం ఉదయం బాలికను ఆమె ఇంటి వద్ద దింపేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే, రాత్రంతా తమ కూతురు ఇంటికి రాకపోయేసరికి బాలిక తల్లి, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
దీంతో అప్పటికే అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో బాలిక ఇంటికి చేరుకుంది. రాత్రంతా ఎక్కడికి వెళ్లావని బాలిక తల్లి, కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీంతో బాలిక జరిగిన విషయం వారికి చెప్పింది. ఇది విని తీవ్ర వేదనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నవీన్, వెంకట రమణ, రేణుకను అరెస్టు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.