Dehradun | డెహ్రాడూన్, ఆగస్టు 18: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ నెల 12న అర్ధరాత్రి తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని ఓ బాలిక(15) ఆరోపించింది. తనపై అయిదు మంది బస్సులో లైంగిక దాడి చేశారని తెలిపింది. బస్టాండ్‌లోని ఓ దుకాణం కాపలాదారు ఆమె దీన స్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చేయించిన వైద్య పరీక్షల నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఘటన జరిగిన బస్సుతో పాటు, మరో బస్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాగా, బాధితురాలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నది.
బెంగళూరు: ఓ కళాశాల విద్యార్థిని (21)కి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి, ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈస్ట్ జోన్ అదనపు పోలీస్ కమిషనర్ రమణ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు గెట్ టుగెదర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, శనివారం అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తన స్నేహితులకు ఎమర్జెన్సీ మెసేజ్ పంపించి, లొకేషన్ షేర్ చేసింది. ఆమె స్నేహితులు వెళ్లి చూసేసరికి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని హోసూర్ సర్వీస్ రోడ్డు సమీపంలో ఓ లారీ వెనుక కనిపించింది. ఆమె ఒంటిపై ఒక జాకెట్ మాత్రమే ఉంది. వారు ఆమెకు బట్టలు ఇచ్చి, సమీపంలోని దవాఖానకు తరలించారు. అదే సమయంలో వారికి ఆ లారీ దగ్గర ఓ వ్యక్తి కనిపించాడు. అతను ఆందోళనతో ఉన్నట్లు గుర్తించారు. అతనిని పట్టుకోబోగా, పారిపోయాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ: అమెరికాలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బుచ్చిబాబు (40) మృతి చెందారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం బీచ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందాడు.