బెంగళూరు, ఆగస్టు 25: బీజేపీ పాలిత కర్ణాటక ప్రభుత్వాన్ని 40 శాతం కమీషన్’ వివాదం మరోసారి కుదిపేస్తున్నది. కాంట్రాక్టుల్లో 40 శాతం నిధుల్ని లంచంగా ఇవ్వాలంటూ అధికార బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వేధింపులకు గురిచేస్తున్నారని స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్సీఏ) ప్రెసిడెంట్ డీ కెంపన్న మరోసారి ఆరోపించారు. ఈ అంశం లో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాయనున్నట్టు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు అని పేర్కొన్నారని, ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని మంత్రులే లంచాలకు మరిగారని వాపోయారు. ఈ అంశంపై న్యాయవిచారణకు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలంటూ కోలార్ జిల్లా ఇంచార్జ్, మంత్రి మునిరత్న అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తమ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని సీఎం బసవరాజ్ బొమ్మై సహా మంత్రులు అడుగుతున్నారని, అయితే న్యాయవిచారణ కమిటీ ముందు మాత్రమే సాక్ష్యాలు బయటపెడుతామని అన్నారు. తమ ఆరోపణలు తప్పని తేలితే, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనన్నారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యతో కెంపన్న భేటీ అయ్యారు.
కెంపన్న ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో చేసినవేనని సీఎం బొమ్మై ఎదురుదాడికి దిగారు. విపక్ష నేత సిద్ధరామయ్యతో భేటీ అనంతరం కెంపన్న ఈ ఆరోపణలు చేశారన్నారు. కాంట్రాక్టర్లకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే లోకాయుక్తకు వెళ్లవచ్చని, ఒకవేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, కాంట్రాక్టుల్లో 40 శాతం కమీషన్ ఇవ్వాలంటూ బీజేపీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఉడుపికి చెందిన కాంట్రాక్టర్ ఒకరు ఈ ఏడాది మొదట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోపణల నేపథ్యంలో ఈశ్వరప్ప మంత్రి పదవి కోల్పోయారు. అయితే, కర్ణాటక పోలీసులు ఆయనకు క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం.