న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. లఖింపూర్ ఖేరి ఘటనలో మంత్రి అజయ్ మిశ్రా నిందితుడని, ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్ మాట్లాడుతూ.. లఖింపూర్‌లో జరిగిన మర్డర్ గురించి సభలో మాట్లాడనివ్వాలన్నారు. లఖింపూర్‌లో జరిగిన హింసాకాండలో రైతులు మరణించిన విషయం తెలిసిందే. అయితే దాంట్లో మంత్రి ప్రమేయం ఉన్నట్లు రాహుల్ ఆరోపించారు. మంత్రి కుట్ర పన్ని రైతుల్ని చంపేశారన్నారు. రైతుల్ని చంపిన మంత్రి రాజీనామా చేయాలని, ఆయన్ను శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. మరో వైపు విపక్ష సభ్యులు వెల్‌లో నినాదాలతో హోరెత్తించారు. లఖింపూర్ బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులు పట్టుకుని విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. లఖింపూర్ ఖేరి కేసు కోర్టు పరిధిలో ఉందని, దాని గురించి చర్చించలేమని మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. ఇక రాజ్యసభలోనూ ఇదే అంశంపై రభస మొదలైంది. మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు.