న్యూఢిల్లీ, మార్చి 31: కేంద్ర ప్రభుత్వపు కొత్త బడ్జెట్(2025-26) నేటి నుంచి అమల్లోకి రానుంది. బడ్జెట్లో పేర్కొన్న ఆదాయపన్ను కొత్త శ్లాబులు, మినహాయింపులు, యూపీఐ రూల్స్, ఇతర నిబంధనలూ ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పౌరులందరూ ఆయా నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించడం ద్వారా మెరుగైన ఆర్థిక నిర్వహణ చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
ఏడాదికి రూ.12లక్షల లోపు ఆదాయం కలిగిన వాళ్లకు పన్ను పరిధి నుంచి మినహాయింపు లభించనుంది. ఇందులో వేతన జీవులకు రూ.75 వేలు రాయితీ కల్పించింది. అంటే వారికి రూ.12.75లక్షల వరకు మినహాయింపు వర్తించనుంది.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం 25 ఏండ్లకు పైగా సర్వీసు కలిగిన ఉద్యోగులకు చివరి 12 నెలల వేతనంలో బేసిక్ సాలరీకి సమానంగా పింఛన్ సదుపాయం కలగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని 23లక్షల ఉద్యోగులు యూపీఎస్ పరిధిలోకి రానున్నారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎన్పీసీఐ మార్గదర్శకాల ప్రకారం యూపీఐ చెల్లింపులు చేయాలంటే బ్యాంకులో కనీస బ్యాలెన్స్ ఉండాల్సిందే అనే నిబంధన అమలు కానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తమ మినిమం బ్యాలెన్స్ నిబంధనలను సవరించనున్నాయి. కనీస నగదు నిల్వలు లేకపోతే పెనాల్టీ పడుతుంది. అలాగే పలు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ రివార్డుల విధానాన్ని సవరించాయి.
వినియోగంలో లేని ఫోన్ నంబర్లతో లింక్ అయిన యూపీఐలు డీయాక్టివేట్ కానున్నాయి. అంతేకాకుండా ఫోన్ నంబర్‌తో సంబంధం లేకుండా యూపీఐ వినియోగిస్తున్న ఖాతాదారులు బ్యాంకుల్లో ఫోన్ నంబర్లను అప్డేట్ చేసుకోవాలి.
జీఎస్టీలో మార్పుల ప్రకారం చెల్లింపుల సమయంలో పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్(ఎంఎఫ్ఏ) తప్పనిసరి కానుంది. 180 రోజులు దాటిన పాత బిల్లులను ఈ పద్ధతిలో చేయడం కుదరదు.