Millionaire Migration | సంపన్నులు భారతదేశాన్ని వీడుతున్నారు. గత కొన్నేళ్లుగా సంపన్నుల వలసలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఏడాది 2023లో దాదాపు 6,500 మంది హై నెట్‌వర్త్ వ్యక్తులు (HNWIs) భారత్‌ను వీడే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్-2023 రిపోర్ట్ తెలిపింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషిస్తుంది. 10లక్షల డాలర్లు.. అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే వారిని మిలియనీర్లు లేదా అత్యధిక సంపద కలిగిన వ్యక్తులుగా భావిస్తుంటారు. అయితే, సంపన్నులను కోల్పోతున్న దేశాల జాబితాలో ఈ ఏడాది చైనా ముందు వరుసలో నిలువగా.. భారత్ రెండోస్థానం, యూకే మూడోస్థానంలో, రష్యాలో నాలుగో స్థానంలో ఉన్నది.
చైనాలో 13,500 మంది సంపన్నులు దేశం వీడే అవకాశాలున్నాయని అంచనా. యూకే నుంచి 3200 మంది, రష్యా నుంచి 3వేల మంది సంపన్నులు వీడతారని నివేదిక పేర్కొంది. భారత్ రెండో స్థానంలో ఉండగా.. గతేడాది పోలిస్తే దేశాన్ని వీడే సంపన్నుల సంఖ్య తక్కువగానే ఉన్నది. గతేడాది దేశం నుంచి 7500 మంది హై నెట్‌వర్త్ వ్యక్తులు వలస వెళ్లారని అంచనా. అయితే, భారత్ పన్నుచట్టం, అందులోని సంక్లిష్టతల కారణంగా వలసలు కనిపిస్తున్నాయని, వారంతా దుబాయి, సింగపూర్ దేశాలకు వసల వెళ్తున్నట్లు తేలింది. ఆయా దేశాల ప్రభుత్వాలు నిర్వహిస్తున్న గోల్డెన్ వీసా ప్రోగ్రామ్, అనుకూలమైన పన్నుల వాతావరణం, బలమైన వ్యాపార వ్యవస్థ, సురక్షితమైన, శాంతియుతమైన వాతావరణం సంపన్నులను ఆకర్షిస్తున్నాయి.
గత పదేళ్లకాలంలో సంపన్నుల వలసల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోందని హెన్లీ అండ్ పార్ట్నర్స్ సీఈవో డాక్టర్ జుయెర్జ్ స్టెఫెన్ తెలిపారు. భారతదేశం నుంచి సంపన్నులు భారీగా తరలిపోతున్నా.. అంతకుమించిన సంఖ్యలో సంపన్నులు పుట్టుకువస్తున్నారని న్యూ వరల్డ్ వెల్త్‌కు చెందిన పరిశోధకుడు ఆండ్రూ ఆమోయిల్స్ పేర్కొన్నారు. భారత్ నుంచి వలసలు కొనసాగినా ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. అధిక ఆదాయం కలిగిన వ్యక్తుల జీవితాలను ఆర్థికమంత్రిత్వ శాఖ కష్టతరం చేస్తుందని ఇన్ఫోసిస్ బోర్డు మాజీ సభ్యుడు టీవీ మోహన్‌దాస్ ట్వీట్లో పేర్కొన్నారు. పన్ను విధానాలను సరళీకృతం చేయాలని పేర్కొన్నారు. భద్రత, విద్య, ఆరోగ్యం, వాతావరణ మార్పు, క్రిప్టోపై ప్రేమ తదితర కారణాలతో చాలా మంది పెట్టుబడిదారులు తమ కుటుంబాలను ఇతర దేశాలకు తరలిస్తున్నారని హెన్లీ అండ్ పార్ట్నర్స్కు చెందిన డొమినిక్ వోలెక్ తెలిపారు.