ముంబై: బిజినెస్ ట్రిప్ పేరుతో ఎంజాయ్ చేసేందుకు మాజీ మంత్రి కుమారుడు ప్రయత్నించాడు. కుటుంబానికి చెప్పకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి చార్టర్డ్ విమానంలో బ్యాంకాక్ బయలుదేరాడు. అయితే అతడి కిడ్నిప్ ఆరోపణలపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. నాటకీయ పరిణామాల మధ్య ఆ విమానం వెనక్కి మళ్లింది. (Mid-Air Drama) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. షిండే వర్గం శివసేనకు చెందిన మాజీ మంత్రి తానాజీ సావంత్ కుమారుడైన 32 ఏళ్ల రిషిరాజ్ సావంత్ తన కుటుంబానికి చెప్పకుండా బ్యాంకాక్ టూర్‌కు ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి10న సాయంత్రం నాలుగు గంటలకు ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ప్రైవేట్ సంస్థకు చెందిన చార్టర్డ్ విమానంలో బయలుదేరాడు.
కాగా, రిషిరాజ్ సావంత్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు అతడి తండ్రికి ఫోన్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి రిషిరాజ్ చార్టర్డ్ విమానంలో వెళ్లినట్లు గుర్తించారు. మాజీ మంత్రి అయిన తానాజీ సావంత్ తన పలుకుబడితో డీజీసీఏను సంప్రదించాడు. ఆ చార్టర్డ్ విమానం పైలట్లతో నేరుగా మాట్లాడి వెనక్కి మళ్లించాలని కోరాడు.
మరోవైపు దీనిని ఫేక్ కాల్‌గా తొలుత పైలట్లు భావించారు. చివరకు డీజీసీఏ రంగంలోకి దిగడంతో వారి ఆదేశాల మేరకు పైలట్లు వ్యవహరించారు. అండమాన్, నికోబార్ దీవులపై ఎగురుతున్న విమానాన్ని వెనక్కి మళ్లించారు. రిషిరాజ్, అతడి ఫ్రెండ్స్‌కు ఈ విషయం తెలియకుండా పైలట్లు, సిబ్బంది జాగ్రత్త వహించారు. మ్యాప్‌లు, నావిగేషన్ స్క్రీన్స్‌ను ఆఫ్ చేశారు. చివరకు సోమవారం రాత్రి 8 గంటలకు ఆ విమానం పూణేలో ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ విమానంలోకి వెళ్లి వారిని కిందకు దించారు. దీంతో మాజీ మంత్రి కుమారుడు రిషిరాజ్, అతడి ఫ్రెండ్స్ షాక్ అయ్యారు.
కాగా, కుమారుడి బూటకపు కిడ్నాప్ వ్యవహారంలో శివసేన నేత తానాజీ సావంత్ పోలీసులు, డీజీసీఏ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఇలాంటి సంఘటనను తాము ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని ప్రైవేట్ చార్టర్డ్ విమాన సంస్థ అధికారి పేర్కొన్నారు.