Mock Drills | అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతను నిర్ధారించుకునేందుకు ఈ నెల 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో చెప్పింది. శత్రువులు దాడి చేసిన సమయంలో విద్యార్థులు, యువకులు స్వీయరక్షణతో పాటు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని సూచించింది. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. భారత్‌పై పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడొచ్చని అంచనాలున్నాయి. ఈ క్రమంలో హోంమంత్రిత్వశాఖ ముందస్తుగా రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నది. దాడి జరిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టాలని, ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరెన్ల పనితీరును పరీక్షించాలని, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌ను ముప్పేట దెబ్బకొడుతున్నది. ఇప్పటికే సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్నది.
అదే సమయంలో క్షిపణి పరీక్షలు చేస్తున్నది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ కేంద్రం ఈ సూచనలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని చెప్పిన కేంద్రం.. తాజాగా ఉద్రిక్తతల నేపథ్యంలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పింది. ఈ మాక్ డ్రిల్‌లో ఏదైనా దాడి జరిగితే తమను తాము ఎలా రక్షించుకోవాలో సాధారణ పౌరులు, విద్యార్థులు మొదలైన వారికి శిక్షణ ఇస్తారు. బ్లాకౌట్ కోసం ఏర్పాట్లు స్తారు. అవసరమైతే, శత్రువు ఏ లక్ష్యాన్ని చూడకుండా విద్యుత్‌ని నిలిపివేస్తారు. కీలక కర్మాగాలను, స్థావరాలను గుర్తించకుండా ఏర్పాటు చేస్తారు. ఆదివారం ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల బ్లాక్అవుట్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర సంసిద్ధతను పరీక్షించడానికి స్టేషన్ కమాండర్, కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడి ఆదేశాల మేరకు రాత్రి 9 నుంచి రాత్రి 9.30 వరకు నిర్వహించినట్లు ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గుర్జంత్ సింగ్ వివరించారు.