భువనేశ్వర్, జనవరి 29: ఒక పోలీస్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబా కిశోర్ దాస్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఒడిశాలో ఆదివారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బ్రజ్‌రాజ్‌నగర్ ఎస్డీపీవో గుప్తేశ్వర్ భోయ్ కథనం ప్రకారం బ్రజ్‌రాజ్‌నగర్ పట్టణంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన ఏఎస్సై గోపాల్ దాస్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మంత్రి మృతి పట్ల ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీఐడీని ఆదేశించారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు కాల్పుల గురించి ఇలా వివరించారు… ప్రజా ఫిర్యాదుల కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి అతిథిగా విచ్చేశారు. చాలా మంది ఆయనకు స్వాగతం పలకడానికి గుమికూడారు. ఇంతలో హఠాత్తుగా కాల్పులు జరిగాయి. మంత్రిని దగ్గర నుంచి కాల్చిన పోలీసు వెంటనే పారిపోవడానికి ప్రయత్నించాడు. మెరుగైన వైద్యం కోసం మంత్రిని భువనేశ్వర్‌కు తరలించారు.
నిందితుడు మంత్రి ఛాతీలోకి నాలుగైదు తూటాలు పేల్చినట్లు తెలుస్తున్నది. ‘ఒక తూటా గుండె, ఎడమ ఊపిరితిత్తిని గాయపరిచింది. రక్త స్రావం తీవ్రంగా జరిగింది. ఐసీయూలో ఉంచి గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’ అని వైద్యులు తెలిపారు. కాల్పుల ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ‘భద్రతా వైఫల్యం’ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపిస్తూ బీజేడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించేదని సీనియర్ జర్నలిస్ట్ ప్రసన్న మొహంతి అన్నారు. జర్సుఖాడా ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన నేతగా పేరున్న నబా దాస్ 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేడీలో చేరారు. ఆయనకు గనుల తవ్వకం, రవాణా, ఆతిథ్య రంగాల వ్యాపారాలున్నాయి.
నిందితుడికి మానసిక వ్యాధి!
కాల్పుల ఘటనపై నిందితుడి భార్య జయంతి స్పందించారు. ఏడెనిమిదేండ్లుగాతన భర్త మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని, అందుకు మందులు కూడా తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆయన చూడటానికి పూర్తిగా సాధరణ మనిషి లాగానే కనిపిస్తాడని చెప్పారు. మంత్రితో తన భర్తకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని తెలిపారు. కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజమేమిటో కనుక్కోవాలని ఆమె డిమాండ్ చేశారు.