న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి (Suresh Gopi) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలని అన్నారు. నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన సురేష్ గోపి ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాలు వారు పర్యవేక్షిస్తేనే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. ‘గిరిజన సమాజానికి చెందిన వ్యక్తి మాత్రమే ఆ వ్యవహారాల శాఖ మంత్రి అవుతున్నారు. ఇది మన దేశానికి శాపం. గిరిజన సమాజం వెలుపల నుంచి ఒకరిని వారి సంక్షేమం కోసం నియమించాలనేది నా కల. నా భావన. ఒక బ్రాహ్మణుడు లేదా నాయుడు ఆ శాఖ బాధ్యతలు చేపట్టనివ్వండి. గణనీయమైన మార్పు ఉంటుంది’ అని అన్నారు.
కాగా, అదే విధంగా గిరిజన నాయకులకు ఉన్నత వర్గాల సంక్షేమ శాఖ ఇవ్వాలని సురేష్ గోపి సూచించారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి మార్పు జరుగాలని అన్నారు. అలాగే గిరిజన వ్యవహారాల శాఖను నిర్వహించాలనే తన కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు. ఆ మంత్రిత్వ శాఖను తనకు కేటాయించాలని ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. అయితే, శాఖల కేటాయింపులో కొన్ని విధానాలు ఉన్నాయని అన్నారు.
మరోవైపు కేరళలోని త్రిస్సూర్ ఎంపీ సురేష్ గోపి చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బెనోయ్ విశ్వం తీవ్రంగా మండిపడ్డారు. కుల వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన సురేష్ గోపితోపాటు విద్య, సంక్షేమంలో కేరళ వెనుకబడిందని రాష్ట్రాన్ని అవమానించిన కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ను మంత్రి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.