న్యూఢిల్లీ : రాజౌరీ ఉగ్రదాడి నేపధ్యంలో బీజేపీపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విరుచుకుపడ్డారు. కశ్మీర్లో అమాయకులు మరణిస్తే బీజేపీకి లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. మైనారిటీలకు వ్యతిరేకంగా కాషాయ పార్టీ ప్రచారం సాగించడం, కశ్మీరీలను రాక్షసులుగా చిత్రీకరించడం ద్వారా లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.
జమ్ము కశ్మీర్లోని రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించిన ఘటన నేపధ్యంలో మెహబూబా ముఫ్తీ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేదానికి జవాబుదారీతనం కొరవడిందని అన్నారు. ఆర్మీయే దీనికి బాధ్యత వహించాలని రాజౌరిలో ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు సైన్యం తాము విచారణ జరుపుతామని చెబుతున్నదని అన్నారు. ఇక రాజోరి జిల్లాలోని డాంగ్రి గ్రామంలో సోమవారం జరిగిన మరో ఉగ్రదాడిలో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వ్యక్తి నివాసం సమీపంలో పేలుడు జరిగింది. ఉగ్రదాడుల నేపధ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని రాజౌరిలో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన చేపట్టారు.