Meghalaya : మేఘాలయ (Meghalaya) రాజధాని షిల్లాంగ్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ నిర్మాణ స్థలంలోని ఓ బావిలో విషవాయువుతో ఐదుగురు మృతిచెందారు. తూర్పు ఖాసీ హిల్స్ (East Khasi Hills) జిల్లా పోలీసు అధిపతి వివేక్ సియెమ్ (Vivek siem) తెలిపిన వివరాల ప్రకారం.. లాపాలాంగ్ (Lapalang) ప్రాంతంలోని ప్రైవేట్ స్థలంలో ఉన్న బావిలో నలుగురు కూలీలు నీళ్లు తోడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. బావిలో ఉన్న జనరేటర్ నుంచి విషపూరిత వాయువు వెలువడింది.
ఈ విషవాయువు కారణంగా వారికి ఊపిరాడక అక్కడే కుప్పకూలారు. అయితే వీరిని రక్షించేందుకు అదే ప్రాంతంలో నివసించే ఇద్దరు సొంత సోదరులు బావిలోకి దిగారు. దాంతో దట్టమైన పొగ కమ్మడంతో వారుకూడా అందులోనే చిక్కుకుపోయారు. ఎలాగోలా ఒక వ్యక్తి మాత్రం సురక్షితంగా బయటపడగలిగాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తక్షణమే రెస్క్యూ టీమ్‌తో రక్షణ చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండాపోయింది.
ఈ విషాదకర ఘటనలో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే పోస్టుమార్టం నుంచి కచ్చితమైన నివేదికలు వచ్చిన తరువాతే మరణాలకు గల అసలు కారణాలేంటో స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.