మస్కట్: పెండ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పక ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలంటున్నది ఒమన్ ప్రభుత్వం. ఈ ఏడాది జనవరి 1 నుంచి వివాహానికి ముందు స్త్రీ, పురుషులిద్దరూ కొన్ని రకాలు టెస్ట్లు చేయించుకుని ఈ సర్టిఫికెట్ పొందడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిబంధన ఒక్క ఒమన్ పౌరులకే కాదు.. ఆ దేశానికి చెందిన వారిని వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా వర్తిస్తుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందేందుకు పౌరులు రెండు రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఒకటి రక్త పరీక్ష, రెండోది వ్యాధి నిర్ధారణ పరీక్ష. ఒమన్ దేశ జనాభాలో 9.5 శాతం సికిల్ సెల్ అనీమియా, తలసేమియా వ్యాధులతో బాధపడుతున్నందున దీని కోసం రక్త పరీక్ష చేయించుకోవాలి. జన్యుపరమైన లోపాల నివారణకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. అలాగే భాగస్వామి, పిల్లల రక్షణ కోసం వారు హెచ్ఐవీ/ఎయిడ్స్, హెపటైటిస్ బి, సీ పరీక్షలు చేయించుకోవాలి.