Karnataka | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా నాయకుల ఆస్తుల చిట్టా బయటపడుతుంది. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు వైరల్ అవుతున్నాయి.
కర్ణాటక మంత్రి ఎంటీబీ నాగరాజు దాఖలు చేసిన అఫిడవిట్లో తన పేరిట రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నాగరాజు హోసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. నాగరాజు భార్య పేరిట రూ. 536 కోట్ల చరాస్తులు, రూ. 1,073 కోట్ స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరి పేరు మీద రూ. 98.36 కోట్ల రుణాలు ఉన్నాయని ప్రకటించారు.
2018 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన ఆయన అప్పట్లో రూ. 1,120 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జేడీఎస్ – కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారం చేపట్టే క్రమంలో మూకుమ్మడిగా రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో నాగరాజు కూడా ఒకరు. బీజేపీలో చేరిన తర్వాత 2020 ఉప ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో రూ. 1220 కోట్ల ఆస్తులు చూపించారు. ఆ ఎన్నికల్లో నాగరాజు ఓటమి పాలయ్యారు. అనంతరం విధాన పరిషత్తుకు ఎంపికై మంత్రి పదవి చేజిక్కించుకున్నారు. మొత్తంగా ఈ ఐదేండ్లలో ఆయన ఆస్తులు విలువ రూ. 500 కోట్లు పెరిగింది. తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నాగరాజు స్థిరాస్తి వ్యాపారి కాగా, ప్రధాన వృత్తి వ్యవసాయం.