Mayawathi | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నియామకమైన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. గడ్డుకాలంలో దళితులను కాంగ్రెస్ బలి పశువులను చేస్తోందని, ఇదో మోసమని ఆమె ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్‌ను, ఆయన సమాజాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేశారనడానికి కాంగ్రెస్ చరిత్రే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ మంచిరోజుల్లో దళితుల భద్రతను, గౌరవాన్ని గుర్తుపెట్టుకోదని, కష్ట సమయాల్లోనే బలి పశువుగా చేస్తుందన్నారు. దళితులపై కాంగ్రెస్‌కు అసలు ప్రేమ ఇదేనా? అని ప్రజలు అడుగుతున్నారన్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడగా.. శశిథరూర్‌పై మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. సోనియా గాంధీ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆమె అధ్యక్ష పీఠంపై కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు. మరో వైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించిన విషయం విధితమే. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఎన్నికల్లో ఖర్గే గెలుపొందారు. గతంలో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాట లేకపోయింది. ఈ పరిస్థితుల్లో రాబోయే పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే పార్టీని ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.