KN Rajnna | మంత్రివర్గం నుంచి కేఎన్ రాజన్నను తొలగించడాన్ని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. తుమకూరు జిల్లాలోని మధుగిరి పట్టణంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు మధుగిరి బంద్‌కు పిలుపునిచ్చారు. వేలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు రాజన్నకు మద్దతుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓ మద్దతుదారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పలువురు కార్యకర్తలు అడ్డుకున్నారు. మధుగిరి మునిసిపాలిటీ వార్డు సభ్యులు, నేతలు సామూహిక రాజీనామాలు చేశారు. రాజన్న మద్దతుదారులు నిరసనగా ప్రదర్శన నేపథ్యంలో ఈ వ్యవహారంలో బీజేపీ సైతం స్పందించింది. శాసనసభ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ ప్రభుత్వంలో నుంచి రాజన్నను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. దానిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
స్పీకర్ ఖాదర్ కల్పించుకొని ఇది పార్టీ అంతర్గత విషయమన్నారు. అయితే, బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. రాజన్న తొలగింపుకు దారితీసిన కుట్రలు, కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలపై ప్రతిపక్ష నాయకులు సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల అంశంలో చేసిన వ్యాఖ్యలతోనే రాజన్నను అధికార పార్టీ పక్కనపెట్టిందని.. నిజం చెప్పేవారిని ఎప్పుడూ బలి చేస్తారా? అని అశోక్ ప్రభుత్వాన్ని నిలదీశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు నారాయణస్వామి ఈ అంశంపై గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి రాసిన లేఖను చదివారు. కాంగ్రెస్ చీఫ్ విప్ సలీం అహ్మద్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. కేఎన్ రాజన్నను మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఈ వ్యవహారంతో మరోసారి రాజకీయంగా గందరగోళ పరిస్థితి నెలకొన్నది. రాజన్న తొలగింపునకు కారణాలు చెప్పాలని మద్దతుదారులతో పాటు ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.