Buss Fire Accident | రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. రన్నింగ్ బస్సులో మంటలు భీకరమైన మంటలు చెలరేగాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనం కాగా.. మరికొందరు కిటికీలు పగులగొట్టి తప్పించుకున్నారు. మంటలు చెలరేగడంతో బస్సు డోర్ లాక్ అయ్యాయని.. దాంతో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు వీలు లేకుండాపోయిందని తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో 19 మంది గాయపడగా.. వారిని జోధ్‌పూర్ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇందులో నలుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారిలో స్థానిక జర్నలిస్ట్ రాజేంద్ర సింగ్ చౌహాన్ సైతం ఉన్నారు. బస్సు జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తుండగా.. ఏసీ యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘోర ప్రమాదం తర్వాత రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ బిహార్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఘటన, సహాయక చర్యలపై ఆయన పర్యవేక్షించారు. జోధ్‌పూర్‌కు తీసుకువచ్చిన బాధితుల్లో ఎక్కువ మంది 70 శాతానికి పైగా కాలిన గాయాలతో మరణించారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సీఎం తెలిపారు.
మృతుల్లో సైనికుడు మహేంద్ర, అతని, భార్య ఇద్దరు కూతుళ్లు సైతం బసు ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. మహేంద్రను జైసల్మేర్‌లోని ఒక ఆయుధ డిపోలో పని చేస్తున్నారు. ప్రస్తుతం సైన్యం ఆయన కుటుంబం గురించి ఆరా తీస్తున్నది. బస్సు ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. జైసల్మేర్‌లో జరిగిన ప్రమాదం, ప్రాణనష్టం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్లు పేర్కొననారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం స్పందించారు. బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మరణించడం హృదయ విదారకమని.. ఈ విషాద వార్త తనను కలచివేసిందన్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీశామని.. డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతులను గుర్తించనున్నట్లు పోఖ్రాన్ ఎమ్మెల్యే మహంత్ ప్రతాప్ పూరి పేర్కొన్నారు.
అయితే, ప్రైవేటు బస్సు జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తుంది. జోధ్‌పూర్ హైవేలోని థైయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సులో పొగలు వచ్చాయి. కొద్ది సమయంలోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఎప్పటిలాగే మధ్యాహ్నం 3 గంటలకు జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు బయలుదేరింది. దాదాపు 20 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బస్సు వెనుక నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. డ్రైవర్, ప్రయాణికులు ఏమీ అర్థం చేసుకునేలోగానే మంటలు బస్సును చుట్టుముట్టాయి. కొందరు ప్రయాణికులు వెంటనే తేరుకొని అద్దాలను పగులగొట్టి బయపడ్డారు. మరికొందరు మంటలకు ఆహుతయ్యారు. ఇందులో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు.
Distressed by the loss of lives due to a mishap in Jaisalmer, Rajasthan. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of…
— PMO India (@PMOIndia) October 14, 2025