Manipur Violence | ఇంఫాల్, ఆగస్టు 10: మణిపూర్‌లో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన ఘటనను మరువకముందే.. మరో అమానుష ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన మే 3న కుకీ తెగకు చెందిన దుండగులు తనపై లైంగిక దాడి చేశారని చురాచాంద్‌పుర్ జిల్లాకు చెందిన మహిళ(37) వెల్లడించారు. ఆ భయంతో, అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలి వాంగ్మూలం మేరకు బుధవారం జీరో ఎఫ్ఆర్ఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ‘ఆ రోజు కుకీ తెగ వారు ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులు మా ఇండ్లకు నిప్పు పెట్టడంతో నేను నా చిన్నారి మేనకోడలిని భుజాన మోసుకొంటూ నా ఇద్దరు పిల్లలు, బంధువులతో కలిసి పారిపోతూ కింద పడ్డాను. నేను లేవలేకపోవడంతో.. నా పిల్లల్ని నా బంధువులకు అప్పగించి వారిని పారిపోమన్నాను. ఇంతలో కొందరు వ్యక్తులు నన్ను అడ్డగించి లైంగిక దాడి చేశారు’ అని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. వైద్యులు కౌన్సిలింగ్ చేసి ధైర్యం చెప్పడంతో తనపై జరిగిన దాడిని మీడియాకు వెల్లడిస్తున్నానని బాధితురాలు చెప్పారు.
సంపూర్ణ నిరాయుధీకరణ చేపట్టాలి
ఇంఫాల్, ఆగస్టు 10: మణిపూర్‌లో శాంతిభద్రతలు నెలకొనాలంటే సంపూర్ణ స్థాయిలో నిరాయుధీకరణ చేపట్టాలని ఆ రాష్ర్టానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కోరారు. కుకి మిలిటెంట్ గ్రూప్‌తో కేంద్రం కుదుర్చుకున్న ఎస్వోవో(సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్) ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని, అటామనస్ జిల్లా కౌన్సిల్స్‌ను బలోపేతం చేయాలని ప్రధానికి రాసిన లేఖలో ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మణిపూర్‌లో ఎన్నార్సీ అమల్లోకి తేవాలని కోరారు. ఈ 40 మంది ఎమ్మెల్యేలలో అత్యధిక మంది మైతీ గ్రూప్‌నకు చెందినవారే ఉండటం గమనార్హం. ‘కుకీ గ్రూప్ లేవనెత్తుతున్న ‘ప్రత్యేక పాలనా ప్రాంతాల ఏర్పాటు’ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో కేవలం భద్రతా బలగాల్ని మోహరిస్తే సరిపోదు. హింస చెలరేగుతున్న ప్రాంతాల్లో సంపూర్ణ నిరాయుధీకరణ చేపట్టాలి. తిరుగుబాటు గ్రూపులు, అక్రమ చొరబాటుదార్ల చేతుల్లో ఆయుధాలు లేకుండా చేయాలి’ అని వారు పేర్కొన్నారు.