కొచ్చి: కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ గది(Emergency Room).. ఓ జంటకు పెళ్లి వేదికగా మారింది. బెడ్‌పై పడుకున్న వధువు మెడలో తాళి కట్టాడు వరుడు. వివరాల్లోకి వెళ్తే.. అలపుజకు చెందిన అవని అనే అమ్మాయి.. తుంబోలికి చెందిన వీఎం షారన్ అనే అబ్బాయి వీసీఎస్ లేక్‌షోర్ ఆస్పత్రి ఎమర్జెన్సీ రూమ్‌లో పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి తుంబోలిలో శుక్రవారం మధ్యాహ్నం ఆ జంట పెళ్లి చేసుకోవాల్సి ఉంది. అయితే బ్రైడల్ మేకప్ కోసం వధువు అవని మరో గ్రామానికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె కారు కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ అమ్మాయిని కొట్టాయం మెడికల్ కాలేజీలో చేర్పించారు.
వెన్నుపూసకు గాయం కావడంతో వధువు అవనిని ఎర్నాకుళం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పెళ్లి ముహూర్తం మధ్యాహ్నం 12.15 నుంచి 12.30 గా ఫిక్స్ చేశారు. కానీ అవని గాయపడడంతో ఆ ముహూర్తం మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండు కుటుంబాలు ఆ మంగళకరమైన ముహూర్తంలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాయి. దీంతో డాక్టర్ల అనుమతి తీసుకుని పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే అవని బెడ్‌పై పడుకొన్నది. ఆమె మెడలో షారన్ తాళి కట్టాడు. అనుకున్న ముహూర్తం ప్రకారమే తాళి కట్టినట్లు డాక్టర్ సుదీష్ కరుణాకరన్ తెలిపారు.