న్యూఢిల్లీ : వైవాహిక బంధంలో ప్రవేశించినవారు ఆ బంధాన్ని కొనసాగిస్తూ, తన భర్త లేదా భార్య నుంచి తనకు సంపూర్ణ స్వాతంత్య్రం ఉందని చెప్పడం అసాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు సంపూర్ణ స్వేచ్ఛ కావాలని ఎవరైనా కోరుకుంటే, వారు వైవాహిక బంధంలో ప్రవేశించకూడదని చెప్పింది. విడిపోయిన భార్యాభర్తల కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి అంటే ఇద్దరు ఒకచోటకు చేరడమని, పెళ్లి చేసుకుని కూడా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎలా చెప్పగలరని ధర్మాసనం ప్రశ్నించింది. పిల్లల ప్రయోజనం కోసం దంపతులిద్దరూ సయోధ్య కుదుర్చుకోవాలని హితవు పలికింది.
ఈ కేసులో భర్త సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. భార్య హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యారు. తన భర్తకు వివాదాన్ని పరిష్కరించుకోవడం ఇష్టం లేదని భార్య ఆరోపించారు. ఆయన కేవలం పిల్లల కస్టడీ, సందర్శన హక్కులను మాత్రమే వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. తాను సింగపూర్‌నకు వెళ్లకపోవడానికి కారణం తన భర్త గతంలో ప్రవర్తించిన తీరు అని చెప్పారు. తనకు పోషణ భత్యం అందలేదని తెలిపారు. అందుకే తాను ఒంటరి తల్లిగా జీవనోపాధి కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తదుపరి విచారణ వచ్చే నెల 16న జరుగుతుందని కోర్టు తెలిపింది. సయోధ్య కుదుర్చుకోవడం కోసం విడాకుల ప్రొసీడింగ్స్‌ను నిలిపి ఉంచడానికి భర్త అంగీకరించారు.