న్యూఢిల్లీ, జూలై 11: మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణ కోట, సైనిక వ్యవస్థను సూచించే ‘మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్’ను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్టు యూఎన్ సంస్థ ఎక్స్‌లో ప్రకటించింది. పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ హెరిటేజ్ కమిటీ 47వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 12 కోటల సమాహారంలో సల్హేర్ కోట, శివనేరి కోట, లోహ్‌గఢ్, ఖండేరి కోట రాజీగఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయ్ దుర్గ్, సింధుదుర్గ్లు మహారాష్ట్రలో ఉండగా జింజీ కోట తమిళనాడులో ఉంది. కాగా, మరాఠీ మిలిటరీ ల్యాండ్‌స్కేప్‌లు 17-19 శతాబ్దాల మధ్య నిర్మించారు. విభిన్న భౌగోళిక, భౌతిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ భాగాలు మరాఠా పాలన వ్యూహాత్మక శక్తులను ప్రతిబింబిస్తాయని భారతీయ అధికారులు పేర్కొన్నారు.