Chhattisgarh | కొత్తగూడెం క్రైం/చర్ల: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు భద్రతా దళాలపై మెరుపు దాడికి దిగారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో మావోయిస్టుల చర్యలను సమర్థంగా తిప్పికొట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న మూడు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారు. ఈ క్రమంలో క్యాంపులకు వెళ్లే రహదారులపై మంగళవారం రాత్రి వృక్షాలు నరికి అడ్డుగా వేశారు. అనంతరం వాటిని దహనం చేస్తూ మంటలు ఎగసేలా చేశారు. ఆ తర్వాత ఏకకాలంలో మూడు బేస్ క్యాంప్‌లపై బ్యారల్ గ్రానేడ్ లాంచర్ల (బీజీఎల్స్)ను ప్రయోగించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ భద్రతాదళాలు అప్రమత్తమై మావోయిస్టుల విధ్వంసక చర్యలను తిప్పికొట్టాయి.