కొత్తగూడెం ప్రగతి మైదాన్/ములుగు/సుబేదారి, అక్టోబర్ 16: అగ్రనేతలతోపాటు దళ సభ్యులు, మావోయిస్టులు వరుసకట్టి వనం వీడుతున్నారు. మావోయిస్టు పార్టీలో మరో కీలక సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ (Maoist Ashanna) సైతం పెద్ద ఎత్తున సైన్యంతో లొంగు‘బాట’ పట్టారు. మావోయిస్టు పార్టీ కీలక సభ్యులున్న 140 మంది దళంతో ఆశన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోయారు. ఆశన్నతోపాటు మాడ్ డివిజన్ ఇన్చార్జి రణిత(డీకేజడ్సీ) సైతం లొంగిపోయారు. వాసుదేవరావు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీఎం), స్టేట్ మిలటరీ కమిషన్(ఎస్ఎంసీ), నార్త్ సబ్ జోనల్ బ్యూరో(ఎన్ఎస్జడ్బీ) కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో నాయకత్వ ద్వంద్వ వైఖరి విధానాల వల్ల విసుగు చెంది జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
గడిచిన రెండు రోజుల్లో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని, చరిత్రలోనే ఇదొక మైలురాయి అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం విధాన పరంగా లొంగిపోవాలనుకునే వారికి స్వాగతం పలుకుతుందని, ఉద్యమం కొనసాగించే వారు తమ దళాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారని హెచ్చరించారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
నర్సింగాపూర్ గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి భిక్షపతిరావు-సరోజన దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు వాసుదేవరావు(ఆశన్న). చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడైన ఆశన్న 1990లో అడవిబాట పట్టారు. ఆశన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. మొదట కాకతీయ యూనివర్సీటీ సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్‌కు ఆశన్న నాయకత్వం వహించారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరారు. బాంబులు, ఆయుధాల తయారీతో పాటు గెరిల్లా వార్ఫేర్లో ఆరితేరిన ఆశన్న మిలిటరీ దాడుల్లో కీలక పాత్ర పోషించారు. ఆశన్నకు ఆపరేషన్ ఆశన్నగా పేరు ఉన్నది.
టీడీపీ మంత్రి మాధవరెడ్డి బాంబు పేలుడు ఘటన, ఐపీఎస్ ఉమేశ్‌చంద్ర కాల్చివేత ఘటన, తిరుపతి అలిపిరి వద్ద ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ని బాంబుపెట్టి పేల్చిన ఘటనకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కాగా వరంగల్ నగర శివారు భట్టుపల్లికి చెందిన కందకట్ల యాదగిరి అలియాస్ రాజ్మన్ కూడా ఆశన్నతోపాటుగా లొంగిపోయినట్లు తెలుస్తున్నది. యాదగిరి దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.