Kamala Sodi | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళా మావోయిస్టు కమలా సోడి గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉంగి అలియాస్ తరుణగా పేరొందిన కమలా సోడిపై రూ. 17 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
రాజ్‌నంద్‌గావ్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అభిషేక్ శాండిల్య, ఎస్పీ లక్ష్య శర్మతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారుల ఎదుటు కమలా లొంగిపోయారు. ఆమె లొంగుబాటుతో మిగతా మహిళా మావోయిస్టులు కూడా అడవిని, ఆయుధాలను వీడి జనస్రవంతిలోకి వస్తారని పోలీసులు విశ్వసిస్తున్నారు. పునరావాస చర్యల్లో భాగంగా తక్షణ సాయం కింద ఆమెకు రూ. 50 వేలు అందించారు.
సుక్మా జిల్లాలోని కుంట ప్రాంతానికి చెందిన సోడి.. సీపీఐ(మావోయిస్టు) పార్టీతో 2011 నుంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ జోన్ పరిధిలో జరిగిన మావోయిస్టు కార్యకలాపాల్లో కమల చురుకుగా పాల్గొన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో జరిగిన మావోయిస్టుల దాడుల్లో కమల కీలకపాత్ర పోషించారు.