
బెంగళూరు, జనవరి 25: కర్ణాటకలో సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఉలిక్కిపడింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన వచ్చిన మరుక్షణం ప్రస్తుతం క్యాబినెట్‌లోని అనేక మంది మంత్రులు బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరతారని ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బసవన్న గౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకుగానూ ఫిరాయించేందుకు ఆయా మంత్రులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వచ్చిన నేతలు ఎన్నికల సమయంలో తిరిగి ఆ పార్టీలో చేరుతారని అన్నారు. యూపీలో స్వామి ప్రసాద్ మౌర్య చేసినట్టుగానే ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పారు. పలువురు నేతలు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో టచ్‌లోకి వెళ్లారని, ఆ మేరకు సమాచారం ఉందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణను వెంటనే చేపట్టాలని ఆయన సూచించారు. బసవన్న గౌడ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు శివకుమార్, సిద్ధరామయ్య స్పందించారు. మంత్రులతో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నది వాస్తవమేనని, అయితే దీనిపై ఇంతకంటే వివరాలు చెప్పలేమని అన్నారు.