న్యూఢిల్లీ : అమెరికాలో ఉద్యోగాలను కోల్పోయిన హెచ్-1బీ వీసాదారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి లేదా వారికి తెలిసినవారికి గ్రేస్ పీరియడ్ 60 రోజులు ముగియక ముందే డిపోర్టేషన్ నోటీసు (నోటీస్ టు అపియర్, ఎన్టీఏ)లు అందాయి. అమెరికాలో ప్రవేశించడంపై శాశ్వత నిషేధాన్ని ఎదుర్కొనే ముప్పు వీరికి ఉంది. బ్లైండ్ అనే యాప్‌లో ఈ నెల 6న నిర్వహించిన పోల్‌లో పాల్గొన్న 1,584 మందిలో దాదాపు సగం మంది తాము భారత దేశానికి తిరిగి వెళ్లిపోతామని చెప్పారు.
అమెరికా నుంచి వెళ్లిపోవాలని బలవంతపెడితే స్వదేశానికి వెళ్లిపోతామన్నారు. ఉద్యోగం కోల్పోయిన వెంటనే అమెరికా నుంచి వెళ్లిపోవాలని ఇమిగ్రేషన్ న్యాయవాదులు సలహా ఇస్తున్నారు. లేనిపక్షంలో అమెరికా నుంచి శాశ్వతంగా బహిష్కరణకు గురయ్యే ముప్పు ఉంటుందని చెప్తున్నారు.
హెచ్-1బీ వీసాలపై ఉన్న ఇండియన్ ప్రొఫెషనల్స్‌లో చాలా మంది తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. బ్లైండ్ యాప్‌లో నిర్వహించిన మరొక సర్వే ప్రకారం, ఇండియన్ ప్రొఫెషనల్స్‌లో 45 శాతం మంది అమెరికాను విడిచిపెట్టవలసి వస్తే, తిరిగి భారత్‌కు వెళ్తామన్నారు. వేతనం తగ్గిపోతుందని 25 శాతం మంది, జీవన ప్రమాణాలు తగ్గిపోతాయని 24 శాతం మంది, ఉద్యోగావకాశాలు తక్కువ అని 10 శాతం మంది చెప్పారు. మళ్లీ యూఎస్ వర్క్ వీసాను ఎంపిక చేసుకుంటారా? అని అడిగినపుడు 35 శాతం మంది మాత్రమే ‘ఔను’ అని, 38 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.