(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయ్యి, 17 నెలలకు పైగా జైలు జీవితం అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత మనీశ్ సిసోడియా ఎట్టకేలకు విడుదలయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందు.. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో, ఇద్దరు ష్యూరిటీ తీసుకొని ఆయనను విడుదల చేయాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ప్రతీ సోమవారం, గురువారం ఏజెన్సీల అధికారుల ముందు హాజరుకావాలని ధర్మాసనం కొన్ని షరతులు విధించింది. కాగా, ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో కిందటేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాను అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
సీబీఐ అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, తాజాగా సిసోడియా జైలు నుంచి విడుదలైనప్పటికీ, ఇప్పటికిప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పదవిని చేపట్టబోరని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సిసోడియా సతీమణి ఆరోగ్యం సరిగా లేదని, ఆమె ఆరోగ్యంపైనే ఆయన ప్రధానంగా దృష్టిసారించనున్నారని పార్టీ నేత ఒకరు తెలిపారు.
17 నెలల జైలు జీవితం తర్వాత శుక్రవారం బయటకు వచ్చిన మనీశ్ సిసోడియాకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. జైలు వద్దకు భారీగా చేరుకొని సిసోడియా రాగానే భుజాలపై ఆయనను ఎత్తుకున్నారు. డీడీయూ మార్గ్‌లోని ఆప్ కార్యాలయంతో పాటు మనీశ్ సిసోడియా ఇంటి వద్దకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్ట్ బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇవాళ నిజం గెలిచిందని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని ‘ఎక్స్’లో పేర్కొన్నది. భగవంతుడి సన్నిధిలో ఎప్పుడూ న్యాయం ఉంటుందని కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేర్కొన్నారు. బెయిల్ ప్రకటన వచ్చిన వెంటనే ‘సత్యమేవ జయతే’ అని ఆప్ నేత, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిశీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘ప్రియమైన చిన్నారులారా.. మీ మనీశ్ మావయ్య తిరిగొచ్చారు’ అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బెయిల్ ఇవ్వాలన్న కోర్టు తీర్పు కేంద్రం నియంతృత్వానికి చెంపపెట్టని మరో ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
‘ఈ తీర్పు నియంతృత్వానికి పెద్ద చెంపపెట్టు. ఇందుకు నేను సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఏ నియంతృత్వ ప్రభుత్వం కూడా అమాయకుడిని జైలులో పెట్టలేదు. నాతో మీరూ బాధను అనుభవించారు. ప్రతి స్కూలు విద్యార్థి నేను బయటకు రావాలని ఎదురుచూశారు. ఈ తీర్పు తర్వాత నేను బాబాసాహెబ్ అంబేద్కర్‌కు రుణపడి ఉన్నట్టు అనిపిస్తున్నది. రాజ్యాంగం ద్వారానే ఈ న్యాయపోరాటానికి తార్కిక ముగింపు దక్కింది’ .