ఇంఫాల్, జూన్ 9 : జాతుల మధ్య వైరంతో గత మూడేండ్ల నుంచి అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో శాంతి అన్నది గగనకుసుమంగా మారింది. ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో నానీ జిల్లాలోని లాంగ్జంగ్/ధంగల్ గ్రామ అధికార యంత్రాంగం మణిపూర్ పోలీసు, అస్సాం రైఫిల్స్, సీఆర్పీఎఫ్కు తాజాగా ఒక నోటీస్ జారీ చేసింది. తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లోకి భద్రతా దళాలు ప్రవేశించరాదని, డ్రోన్లను ఆపరేట్ చేయరాదని అల్టిమేటం ఇచ్చింది. మణిపూర్ కొండ ప్రాంతాల గ్రామ అధికార చట్టం, 1956 ప్రకారం గ్రామాల్లోని శాంతి భద్రతలు, రక్షణ బాధ్యతలు ఆయా గ్రామ అధికార యంత్రాంగానిదేనని తెలిపింది. ఈ క్రమంలో ఇకపై రక్షణ, భద్రతా దళాలు ఇష్టానుసారం గ్రామాల్లోకి ప్రవేశించ రాదని స్పష్టంచేసింది.
గ్రామాల్లో ఏమైనా తనిఖీలు, గస్తీ, దాడులు, అరెస్ట్‌లు వంటివి చేయాలంటే ముందస్తుగా గ్రామ అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాల్సిందేనని తెలిపింది. రాష్ట్రంలో నివాసముంటున్న అక్రమ వలసదారులను గుర్తించి, బహిష్కరించేందుకు రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఇంఫాల్‌లో సోమవారం 14 పౌర సమాజ సంస్థలు 5 కి.మీ భారీ ర్యాలీ నిర్వహించాయి. అలాగే కాంగ్పోక్పీ జిల్లా పోంగ్రింగ్లాంగ్ రోంగ్‌మే నాగా గ్రామంలో కుకీ మిలిటెంట్లు సోమవారం కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత గ్రామంలో అదృశ్యమైన విలేజ్ గార్డు మృతదేహం సమీపంలోని అటవీ ప్రాంతంలో లభ్యమైంది. అతని తలపై తుపాకీ తూటా గాయముంది. కుకీ గ్రూప్‌లను కేంద్ర ప్రభుత్వం ఇలా షాడోవార్కు వాడుకుంటున్నదని నాగా గ్రూప్ ఈ సందర్భంగా ఆరోపించింది. భద్రతా దళాలు కూడా వివక్షతో వ్యవహరిస్తున్నాయని వారు విమర్శించారు.