ఇంఫాల్, సెప్టెంబర్ 10: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర డీజీపీ, రక్షణ సలహాదారుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
వేలాది మంది విద్యార్థులు, మహిళలు ఇంఫాల్‌లోని రాజ్‌భవన్ వైపు ప్రదర్శనగా వెళ్లడానికి ప్రయత్నించగా, వారిని కాంగ్రెస్ భవన్ వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ వారిపై రాళ్లు, గ్లాస్ మార్బుల్ బాల్స్‌తో దాడి చేయడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఘర్షనల్లో 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు.
రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించారు.ఐదు రోజుల పాటు ఐదు లోయ జిల్లాల్లో ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్‌లో పరిస్థితులను అదుపు చేయడానికి 2,000 మందితో మరో రెండు సీఆర్పీఎఫ్ బెటాలియన్లను మోహరించనున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన 58న నంబర్ బెటాలియన్‌ను, జార్ఖండ్‌లోని 112 నంబర్ బెటాలియన్‌ను తరలించనున్నట్టు మంగళవారం అధికారులు తెలిపారు.