ఇంఫాల్ : మెయితీ రాడికల్ సంస్థ అరంబాయ్ తెంగోల్ నేత అరెస్ట్‌తో మణిపూర్‌లో శనివారం నుంచి హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఉద్రిక్తతలు కొనసాగడంతో పశ్చిమ ఇంఫాల్, తూర్పు ఇంఫాల్, థౌబల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. వీశాట్, వీపీఎన్ సౌకర్యాలతో పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను అయిదు రోజులపాటు నిలిపేశారు. నిరసనకారులు శనివారం రాత్రి రోడ్లపై పాత టైర్లు, ఫర్నిచర్లను తగులబెట్టారు.
ఇంఫాల్‌లో భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఖురాయ్ లాంమ్లోంగ్లో ఓ బస్సుకు నిప్పు అంటించారు. రాజ్ భవన్‌కు 200 మీటర్ల దూరంలోని కంగ్లా గేట్ వద్ద నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. కొందరు అరంబాయ్ తెంగోల్ కార్యకర్తలు పెట్రోల్‌తో ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు.