ఇంఫాల్: మణిపూర్లో మైతీ, కుకీ జాతుల మధ్య హింస మొదలై రెండేళ్లు పూర్తయ్యాయి. (Manipur Violence Marks Two Years) జాతి హింస రెండో ఏడాది సందర్భంగా శనివారం ఇంఫాల్ లోయలో ‘సింత లెప్పా’గా వ్యవహరించే బంద్ పాటించారు. దీంతో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. విద్యా, వ్యాపార సంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా సేవలను నిలిపివేశారు. అశాంతి తలెత్తే అవకాశం ఉండటంతో ఇంఫాల్ అంతటా భద్రతా దళాలను మోహరించారు.
కాగా, మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ శనివారం ఖుమాన్ లాంపక్ స్టేడియంలో మణిపూర్ పీపుల్స్ కన్వెన్షన్ నిర్వహించింది. ప్రజలు రోజువారీ కార్యక్రమాలను నిలిపివేసి ఈ సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది. మణిపూర్లో కొనసాగుతున్న సంక్షోభంపై చర్చించడంతోపాటు హింసాకాండలో మరణించిన వారికి కొవ్వొత్తుల ర్యాలీతో నివాళి అర్పించనున్నారు.
మరోవైపు కుకీ, జో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వదేశీ గిరిజన నాయకుల వేదిక శనివారాన్ని ‘విభజన దినోత్సవం’గా పాటించింది. జాతుల సంఘర్షణకు ఏకైక పరిష్కారం ప్రత్యేక పరిపాలన అని ఈ తెగలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తమను కుకీల్లో కలపడానికి ఇష్టపడని థాడౌ కమ్యూనిటీకి చెందిన థాడౌ ఇన్పి మణిపూర్ (టీఐఎం) మే 3ను ‘శాంతి దినోత్సవం’గా జరుపుతున్నది.
కాగా, ఆదిపత్య మైతీ తెగకు ఎస్టీ హోదాను అధికార బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కుకీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 2023 మే 3 నుంచి మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణ మొదలైంది. రెండేళ్లుగా కొనసాగిన హింసాకాండలో 250 మందికిపైగా మరణించగా సుమారు 60,000 మంది నిరాశ్రయులయ్యారు.
అయితే హింసను ప్రేరేపిస్తున్నట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 9న సీఎం ఎన్ బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సిఫార్సుతో ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన అమలవుతున్నది.