ఇంఫాల్: మణిపూర్‌లోని మూడు జిల్లాల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం కంగ్పోక్పి జిల్లా, లోయిచింగ్ రిడ్జ్‌లో రాష్ట్ర పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో రెండు 303 రైఫిళ్లు, ఒక 9 ఎంఎం పిస్తోలు, మ్యాగజైన్, కార్ట్రిడ్జెస్; నాలుగు గ్రెనేడ్లు, రెండు డిటొనేటర్లు, దేశవాళీ మోర్టార్, లాంగ్ రేంజ్ ఇంప్రొవైజ్డ్ మోర్టార్లను స్వాధీనం చేసుకున్నారు.
చురచాంద్పూర్ జిల్లా, గోథోల్ గ్రామంలో చేసిన తనిఖీల్లో రెండు ఇంప్రొవైజ్డ్ మోర్టార్లను స్వాధీనం చేసుకున్నారు. తౌబాల్ జిల్లాలో జరిగిన సోదాల్లో 4 హెచ్ఈ-36 హ్యాండ్ గ్రెనేడ్లు, 2 పుంపి షెల్స్, 3 డిటొనేటర్లు, ఒక స్టన్ గ్రెనేడ్, స్టింగర్ గ్రెనేడ్, బాష్పవాయు గోళాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ అరెస్ట్ చేయలేదు.