Biren Singh | మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఇంఫాల్‌లోని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు. తొలిసారి 2017లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి 2022లో సీఎంగా నియమితులయ్యారు. సీఎంగా రాజీనామా చేయడానికి ముందు బీరెన్ సింగ్.. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండేండ్లుగా మణిపూర్‌లోని మీటి, కుకి జాతుల మధ్య హింస కొనసాగుతున్నది.
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో బీరెన్‌సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఆరుగురు ఎమ్మెల్యేలు గల నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నేతలతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారు.
మీటి, కుకి జాతుల మధ్య సమస్య పరిష్కారంలో బీరెన్‌సింగ్ విఫలం అయ్యారని మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా ఆరోపించారు. మేఘాలయ సీఎంను మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కొందరు అధికార బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.