NITI Aayog | న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ జనాభాలో 10 శాతంగా ఉన్న సీనియర్ సిటిజన్ల(వృద్ధులు) సంఖ్య 2050 నాటికి 19.5 శాతానికి చేరుకొంటుందని నీతిఆయోగ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి నీతి ఆయోగ్ కీలక ప్రతిపాదనలు చేసింది. వృద్ధులకు తప్పనిసరిగా సేవింగ్స్, హౌసింగ్ ప్లాన్ ఉండేలా చూడాలని సూచించింది. అలాగే వయోధికులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు సీనియర్ కేర్ ఉత్పత్తులపై పన్ను తగ్గింపు, జీఎస్టీ సంస్కరణలు తేవాలని అభిప్రాయపడింది.
తమకు అవసరమైన సేవలను సులభంగా పొందేందుకు సీనియర్ సిటిజన్ల కోసం ఒక జాతీయ పోర్టల్‌ను తప్పనిసరిగా అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ పేర్కొన్నది. చాలా మంది వృద్ధులు తమ సేవింగ్స్ నుంచి వస్తున్న ఆదాయంపై ఆధారపడుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు తమ డిపాజిట్లపై పొందే వడ్డీకి ఆచరణీయమైన బేస్ రేటును నిర్ణయించేందుకు ఒక నియంత్రణ యంత్రాంగం అవసరమని పేర్కొన్నది.