బెంగళూరు : లైట్లను స్విచాఫ్ చేయడంపై స్వల్ప వివాదం దారుణ హత్యకు దారి తీసింది. బెంగళూరులోని గోవిందరాజ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాటా డిజిటల్ బ్యాంక్ ఉంది. ఇక్కడ మేనేజర్‌గా పని చేస్తున్న భీమేశ్ బాబుకు ప్రకాశవంతమైన వెలుగు ఇబ్బందికరంగా ఉంటుంది. అవసరం లేనపుడు లైట్లను ఆఫ్ చేయాలని తన సహోద్యోగులను తరచూ కోరుతూ ఉంటారు. అదేవిధంగా శనివారం రాత్రి 1 గంట ప్రాంతంలో తన సహోద్యోగి సోమల వంశీ (24)ను కూడా లైట్లను ఆఫ్ చేయాలని కోరారు.
దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భీమేశ్‌పై వంశీ కారం జల్లి, డంబెల్‌తో తల, ముఖం, ఛాతీలపై తీవ్రంగా కొట్టాడు. భీమేశ్ కుప్పకూలిపోవడంతో వంశీ కంగారుపడి, ఇతర ఉద్యోగుల సహాయం కోరాడు. అంబులెన్స్‌ను పిలిచారు. కానీ భీమేశ్ మరణించినట్లు వెల్లడైంది. వంశీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వంశీ విజయవాడకు చెందినవాడు.