ముంబై, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కింద చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చిన ఘటన మహారాష్ట్ర పుణెలో చోటు చేసుకుంది. 2015 కేదార్నాథ్ వరదల్లో తప్పిపోయిన శివమ్ ఆచూకీ ఎంతకీ దొరకలేదు. కొన్నేండ్ల తర్వాత ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒక గుడిలో దొంగతనం జరిగింది. నిందితుడిని పోలీసులు ప్రశ్నించిగా.. గుడిలో సేవలు చేసే శివమ్ పేరును ప్రస్తావించాడు. శివమ్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అతడిని ఓ మానసిక దవాఖానలో చేర్చారు. ఒక రోజు సామాజిక కార్యకర్త రోహిణి భోస్లే శివమ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకోగా.. ప్రేమ్ విద్యాలయ, రూర్కీ గ్రామం, హరిద్వార్ అని సమాచారం ఇచ్చాడు. రోహిణి వెంటనే ఊరు పేరును గూగుల్‌లో సెర్చ్ చేసి పోలీసుల సాయంతో శివమ్ కుటుంబ సభ్యులకు అతడి సమాచారాన్ని ఇచ్చింది. దీంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
15 ఏండ్ల క్రితం మిస్సింగ్.. ‘సోషల్‌మీడియా’ సాయంతో ఇంటికి!
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: భారత ఆర్మీలో తన మొదటి పోస్టింగ్ కోసం త్రిపురకు వెళ్తుండగా తప్పిపోయిన ఓ వ్యక్తి.. 15 ఏండ్ల తర్వాత మళ్లీ తన కుటుంబాన్ని కలుసుకోగలిగాడు. హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ జిల్లాకు చెందిన బల్దేవ్ జ్ఞాపకశక్తి దెబ్బతిని 15 ఏండ్ల క్రితం తప్పిపోగా, రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం అతడ్ని ఆదరించి.. ‘ఫేస్బుక్’లో ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో బల్దేవ్ను గుర్తించిన అతడి కుటుంబ సభ్యులు.. వెంటనే రాజస్థాన్‌కు బయల్దేరి బల్దేవ్ను తీసుకొచ్చింది. బల్దేవ్ ఇంటికి తిరిగి రావటాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఓ వేడుకగా నిర్వహించారు.